సాధకుడు: అనుగ్రహం గురుప్రసాదమే కదా?

భగవాన్‌: భగవంతుడు, గురువు, అనుగ్రహం పర్యాయపదాలు – శాశ్వతం, ప్రత్యక్షం అయినవి. ఇప్పటికే ఆత్మ నీలో సిద్ధంగా లేదా?  గురువొచ్చి దానిని చూపుతోనో, మరోలాగా ఇవ్వాలా? అలా అని గురువనుకుంటే అతడు గురువే కాదు. పలురకాల దీక్షలున్నట్లు గ్రంథాలలో వుంది – హస్త, స్పర్శ, దృష్టి, మనసు. ఏవేవో ఆర్భాటపు హోమాలు, మంత్రాలూ, జపాలతో గురువు శిష్యుణ్ణి పక్వం చేసి దీక్ష ఇస్తాడనీ, ఆ వింత తంతులతోనే అంతా ఉందనీ!

అసలివన్నీ చేసే, చూసే, రాసే వాడెవడని చూడబోతే ‘గల్లంతే’. అదీ గురువు. అదీ దక్షిణామూర్తంటే! ఆయనేవన్నా చేసాడా? అసలు నోరు విప్పాడా?  కన్ను తెరిచాడా? అంగుళం కదిలాడా! ఉన్నట్టున్నాడంతే. ఎవరో … సనకసనందులు … మరెవరో కానీండి … ఎవరైతేనేం … వచ్చారాయన దగ్గరికి – ఏవేవో అడుగుదామనుకొని. అన్నీ మర్చిపోయి, మతిపోయి చతికిలబడిపోయారు. వారి సందేహాలన్నీ పటాపంచలు. అసలు జరిగిందేమంటే, ఆ వచ్చినవారే పటాపంచలు! వారి ఉనికే గల్లంతు! ఇక మిగిలేది? దాన్నే ‘దైవం, శాంతి, ముక్తి, జ్ఞానం’ అనీ రకరకాలుగా వల్లిస్తారు. దానికవేం పట్టవు. ఎవ్వరేమనుకుంటే ఏమంట, ఏం తంటా? గల్లంతే హాయి! అన్నీ – సాధకుడితో సహా – పోవడమే గల్లంతు. మళ్ళీ దానికో పేరా? పానకంలో పుడకలాగా! ‘గల్లంతే’ ప్రతివాడి, ప్రతిదాని స్వరూపం, నిజరూపం. మౌనం కొంతవరకు దీన్ని సూచిస్తుంది.

మౌనం అత్యంత పాటవమైన పని! వేదవేదాంతాలు ఎంతో వర్ణిస్తాయి, ఘోషిస్తాయి సత్యాన్ని గూర్చి. ఏం లాభం … చివరకు ఓం శాంతిః శాంతిః శాంతిః అంటూ శాంతించి మౌనం వహిస్తాయి. అప్పుడు అసలు వర్ణన నెలకొంటుంది. సత్య గురువు మౌనంగా, స్వరూపంగా ఉంటాడు. ఎక్కడలేని శాస్త్రాల, గ్రంథాల సారమంతా సద్గురువు మౌనానికి సాటిరావు. గురువు మౌనం, నిశ్చలత ఎంతో విశాలం, విస్తారం! సందేహాలన్నీ ఎందుకొస్తాయంటే – ఇన్నేళ్ళిక్కడ పడివున్నాం. ఇలా, ఇంత విన్నాం, ఇంత చేసాం, చెందాం. అయినా, ఏం వచ్చిపడింది ఒళ్ళో? మేం ఏం లాభం పొందలేదంటారు. ఏం చోద్యం! అసలైన లాభం కనబడేదా యావన్నా! అసలీ సాధన సరికొత్త లాభాలను తెచ్చేదా ఏవన్నా? అహంకార, దేహభావ నష్టాన్ని లాభం అంటారా ఎక్కడన్నా? మార్పు అంటావా, సరే! అయితే ఆ మార్పు సంభవించేది అంతరంలో, నిరంతరంగా, నిశ్శబ్దంగా! అంతేగానీ, పైపై తైతక్కలుండవు తండ్రీ. నిశ్శబ్ద, నిశ్చల, నీరూప గురువు వున్నది నీలోనే.

సా: భగవాన్‌ ఉపదేశం ఇస్తారా?

భ: మౌనమే శక్తిపూర్ణమైన ఉత్తమ ఉపదేశం. పైన చెప్పినట్లు, దక్షిణామూర్తి పద్ధతి. స్పర్శ, చూపు ఇవన్నీ తక్కువ రకం. మౌనం సర్వుల హృదయాలను పరివర్తనం చేస్తుంది. వాస్తవానికి గురువూ లేడు, శిష్యుడూ లేడు. అజ్ఞాని తన ఆత్మను ఓ శరీరంగా భావించి, అలాగే ఇంకో శరీరాన్ని గురువు అంటాడు. కానీ గురువు తాను దేహమని భావిస్తాడా? ఆయన శరీరానికి అతీతుడు. ఆయనకు భేదాలేం లేవు. ఆ ప్రకారంగా అజ్ఞాని గురు-శిష్యుల దృక్పథాలను  తెలియలేడు.

సా: వివేకనందస్వామి కూడా మౌనాన్ని అతిబిగ్గర ప్రార్థన అన్నారు.

భ: అంతే, సాధకుని మౌనానికి గురువు మౌనమే బిగ్గరయైన బోధ. అదే కరుణయొక్క అతిశయ రూపం. నిజానికి స్పర్శ, చూపు, తదితర దీక్షలు మౌనం నుంచే రూపొందాయి. అలా అవన్నీ ద్వితీయ పక్షం. మౌనమే ప్రధానం. గురువు మౌనంలోనే సాధకుని మనస్సు శుద్ధమవుతుంది.

తరువాత ‘యోగవాసిష్ఠం’ నుండి స్పర్శ, నయన దీక్షల గూర్చిన ఓ భాగం చదివారు భగవాన్‌ సన్నిధిలో.

భగవాన్‌ ఇలా అన్నారు: శిష్యులు సమీపించినపుడు దక్షిణామూర్తి మౌనం వహించారు. అది సర్వోత్కృష్టమైన దీక్ష. ఇతర ప్రకార దీక్షలన్నీ అందులోనివే. ఇతర పద్ధతులలో కర్త-కర్మల (ఇచ్చేవాడు – తీసుకొనేవాడు) ప్రసక్తి ఉంది. ముందు కర్త, తర్వాత కర్మ ఏర్పడాలి. లేకపోతే ఒకరినొకరు చూడటం, తాకటం వుంటుందా? కానీ, మౌనం పరిపూర్ణ దీక్ష. చూడటం, స్పృశించడం, ఉపదేశం – కలగలసిన సంకీర్ణ రూపం. సాధకుని సర్వప్రకారంగా శుద్ధిచేసి సత్యంలో సుప్రతిష్ఠుని చేస్తుంది.

సా: మంత్రాలను యథాలాపంగా సంపాదించి జపిస్తే ఫలితముందా?

భ: లేదు. ‘అర్హత’ కలవాడు ‘అధికారం’ ఉన్నవానినుంచి ఉపదేశంగా పొందినపుడే ఫలితం.  ఓ కథ వుందిలా: ఓ రాజు తన మంత్రి నివాసానికి వెళ్తే ఆయన జపంలో ఉన్నారని విన్నాడు. రాజు నిరీక్షించి మంత్రి రాగానే వివరం అడిగాడు. తాను మంత్రరాజమైన ‘గాయత్రి’ని జపిస్తున్నానన్నాడు. రాజు తనకా మంత్రాన్ని  ఉపదేశించమన్నాడు. మంత్రి తనకా అధికారం లేదన్నాడు. రాజు ఇతరులనుంచి ఆ మంత్రాన్ని పొంది జపిస్తూ, కొంతకాలం తర్వాత తాను చేసేది సరియేనా అన్నాడు మంత్రితో. మంత్రం సరియైనదే కానీ, దానిని రాజు జపించడం సరికాదన్నాడు మంత్రి. వివరణ కోరాడు రాజు. మంత్రి అటూ ఇటూ, చూసి ఓ భటుణ్ణి పిలిచి రాజుని బంధించమని ఆదేశించాడు. భటుడా ఆజ్ఞను పాటించలేదు. మంత్రి మరల మరల ఆదేశించినా ఫలితం శూన్యం. ఈ సంఘటనతో రాజు కోపించి, అదే భటునితో మంత్రిని బంధించమన్నాడు. ఆజ్ఞ తత్‌క్షణం పాలించబడింది. బందీ అయిన మంత్రి నవ్వి, రాజు కోరిన వివరణ ఇదే అన్నాడు. అర్థంకాక ఆశ్చర్యంతో చూస్తున్న రాజుతో, ”ఆజ్ఞ అదే, పాలకుడు (భటుడు) వాడే, కానీ అధికారి వేరే, కదా! నేను ఆజ్ఞవేస్తే పాలించనివాడు, మీరాజ్ఞ వేయగానే తత్‌క్షణం పాలించలేదా? మంత్రాల విషయంలోనూ ఇలాగే  అధికారం పనిచేస్తుంది” అని వివరించాడు.

మెక్‌ ఐవర్‌, భగవాన్‌ల మధ్య ఉపదేశాన్ని గూర్చిన సంభాషణ సాగిందిలా:

భ: ఉపదేశమంటే ఏమిటి? స్పర్శ, చూపు, మాట … ఇలా రకరకాలు.

సా: భగవాన్‌ది మౌనపదేశమే కదా!

భ: అవును. అది  అత్యుత్తమమైనది మరి.

సా: అది ఆత్మవిచార మార్గానికేనా వర్తించేది?

భ: అన్ని మార్గాలు ఆత్మవిచారంలోనివే.

కొంత సేపయ్యాకా భగవాన్‌ కొనసాగించారు. ఏదో అనిర్వచనీయ శక్తి అందరినీ ఇక్కడకు ఆకర్షిస్తోంది. వారి వారి అవసరాలను అదే చూచుకుంటోంది. అంతటితో ఆ సంభాషణ ముగిసింది.

సా: గురువు లభించేదెలా?

భ: ‘సాక్షాత్‌’గా వుండే దేవుడు తన ప్రియభక్తునిపై కనికరంతో గురురూపం ధరించి అతన్ని ఉద్ధరిస్తాడు. అయితే తానో వ్యక్తిననే దేహభావంతో ఉన్న భక్తుడు ఆయనతో మానవులతో వలెనే బాంధవ్యాన్ని ఆశిస్తాడు. అయితే ఆత్మరూప గురువు భక్తుని అంతరంగంనుంచే పనిచేస్తూ, అతన్ని సరిచేస్తూ, సన్మార్గంలో నడిపి చివరకు అతను తనలోనే ఉన్న ఆత్మను కనుగొనేలా చేస్తాడు.

సా: మరి, భక్తుని కర్తవ్యం?

భ: గురువు చూపిన మార్గంలో పురోగమిస్తూ, అంతరంలో సాధన కొనసాగించాలి. గురువు ‘బాహ్యం’లోను ‘అంతరం’లోను ఉంటాడు. బాహ్యంలో ఉంటూ పరిస్థితులను సాధకుని అంతర్ముఖం చేసే విధంగా చక్కదిద్ది, అంతరంగాన్ని సిద్ధం చేసి, ఆ కేంద్రానికి అతన్ని ఆకర్షిస్తాడు. అలా బయటినుంచి లోపలికి నెట్టుకొచ్చి, లోపలినుంచి ఒక్కసారి గుంజుతాడు. అంతే అంతరంగంలో కుదురుకుంటాడు సాధకుడు.

సా: గురు కరుణ ఎట్టిది? సాక్షాత్కారానికెలా దారి తీస్తుందది?

భ: ఆత్మయే గురువు. ఒకోసారి మనిషి తన జీవితంతో విసిగిపోతాడు. తనకున్నదానితో తృప్తిపడక, ఏవేవో కోరుకొని వాటిని తీర్చుకోడానికి భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు. క్రమంగా అతని మనసు శుద్ధమై దేవుణ్ణి గురించి తెలుసుకోవాలనీ, ఆయన అనుగ్రహం సంపాదించాలనీ కోరుకోవడం మొదలెడతాడు. పాత కోర్కెలు పక్కన పెడతాడు. అపుడు దేవుని నిజమైన అనుగ్రహం యొక్క ప్రకటన మొదలవుతుంది. భక్తునికి గురువై అవతరిస్తాడు. క్రమంగా అతనికి నిజతత్త్వాన్ని బోధిస్తూ, తన సంపర్కం, సత్సంగంతో అతనిని పవిత్రం చేస్తాడు. భక్తుడు కాస్తా సాధకుడై, గురుతత్త్వాన్ని ఆకళింపు చేసుకుంటూ అంతర్ముఖం చెందే శక్తిని సంపాదిస్తాడు. అతడు సాగించే ధ్యానాది సాధనల ద్వారా మరింత శుద్ధుడై, చాంచల్యాన్ని విడిచి, నిశ్చలుడవుతాడు. ఆ నిశ్చలస్థితియే ఆత్మ,

గురువున్నది ఉభయత్ర – బయట, లోపల. బాహ్యంలో ఉండి మనసునో తోపుతోసి అంతర్ముఖం కావిస్తాడు. అంతరంలో ఉండి, అంతర్ముఖమైన మనస్సును కాస్తా లోపలికి గుంజి అక్కడ స్థిమితపరుస్తాడు. అదీ గురువు అనుగ్రహం అంటే. గురువు, దైవం, ఆత్మ – మూడూ వేర్వేరు కాదు. ప్రపంచాన్ని నీ స్వశక్తితో జయించాలని ప్రయత్నిస్తావు. నీవల్ల కాదని తెలిసి, విసిగిపోయి, అంతర్ముఖుడవైనపుడు గ్రహిస్తావు, ”మానవునికంటే గొప్పశక్తి ఒకటి పనిచేస్తోందని”.

అహంకారం మదించిన ఏనుగులా చాలా మొండిది. దానిని అణిచివేయాలంటే అంతకన్నా బలమైన సింహంలాటి గురువే సమర్థుడు. ఆయన చూపుతోటే అహం అనే మదపుటేనుగు వణికిపోయి అంతమొందుతుంది.

నీకు కాలక్రమంలో తెలుస్తుంది. నీవు అంతరించిన స్థితిలోనే నీ నిజమైన వైభవం నెలకొని వుందని. దానిని పొందాలంటే శరణాగతుడవు కావాలి. అప్పుడే గురువు ‘నీవు అర్హుడవు’ అని గుర్తించి మార్గం చూపుతాడు.

సా: నేనా అనుగ్రహం ఎలా పొందగలను?

భ: ఆత్మయే అనుగ్రహం. అది పొందవలసినది కాదు. ఇప్పటికే ఉన్నట్లు గుర్తించు. సూర్యుడంటే వెలుగే. అది చీకటిని చూడలేదు. కాని సూర్యోదయంతో చీకటి పోతోందంటావు. అలాగే గురుకటాక్ష వీక్షణంతో శిష్యుని అజ్ఞాన అంధకారమనే మాయా పిశాచి అదృశ్యమవుతుంది. సూర్యకాంతితో ఆవరించబడి వున్నా, బింబాన్ని చూడాలంటే అది వున్న దిశలో నీ దృష్టిని తిప్పాలి … అలాగే, అనుగ్రహం ఇక్కడే ఇప్పటికే వున్నా, దాని ఉనికిని గుర్తించాలంటే సక్రమమైన ప్రయత్నం చెయ్యాలి.

సా: సాధకుని పక్వతను అనుగ్రహం త్వరితం చేయలేదా?

భ: అది గురువుకే వదిలేయి. షరతులు లేకుండా శరణాగతి చెందు. రెండింటిలో ఏదో ఒకటి చెయ్యాలి; నీ అశక్తతను గుర్తించి, నీకంటే గొప్పశక్తికి శరణు చెందు. లేదా, దుఃఖానికి కారణం అన్వేషించు. దాని మూలాన్ని చేరి ఆత్మలో విలీనం చెందు. ఎలా చేసినా దుఃఖాన్ని దాటిపోతావు. తనను శరణు చెందినవాణ్ణి గురువు, దైవం వదిలిపెట్టరు.

రమణుల ఉపదేశం ప్రధానంగా సనాతనుడైన దక్షిణామూర్తివలె మౌనరూపంలో ఉండేది. ఈ మౌనంలో భక్తుల సందేహాలు తీరడమో, ప్రశ్నలు, సమస్యలు పరిష్కారం కావడమో లేక అంతరించడమో జరిగేది. ఈ మౌనం నాటికీ, నేటికీ అనంతము, విశ్వవ్యాప్తము అయిన గొప్ప క్రియాశీలక శక్తి.