గిరి చుట్టూ
అరుణాచలం నాలుగైదు ఉపశిఖరాలుండి అనేక కోణాలనుంచి కనిపించే ఏకైక ముఖ్యశిఖరంతో అలరారే ఏకపర్వతం. అలాగే రమణుల మార్గం కూడా ‘ఆత్మవిచారణ’ అనే ఒకే శిఖరం కలిగిన దేహాత్మ భావన నిర్మూలించే ఉపాయం. ఉపశిఖరాలున్న గిరిలాగే రమణపంథా కూడా ఇతర సాధనారీతులను ఆమోదిస్తుంది, కడకు ఆత్మవిచారణకు దారితీసే సహాయకారులుగా. అటువంటి సహాయకారియే 14 కి.మీ.ల గిరిప్రదక్షిణ.
పరిక్రమ లేక ప్రదక్షిణ అంటే అరుణాచలం చుట్టూ వున్న 14 కి.మీ.ల మార్గాన్ని సవ్యదిశలో పాదరక్షలు లేకుండా నడచి పూర్తిచెయ్యడం. అంటే, గిరి కుడివైపుకు వచ్చేలా చుట్టిరావడం. దేవరాజ ముదలియార్ తన ‘స్మృతులు’లో ఇలా రాసారు.
”బద్ధకం కారణంగానో, ఉత్తమజ్ఞాన పద్ధతిలో మానసిక సాధనయే సమాధానమని సరిపెట్టుకోవడం వల్లనో గిరిచుట్టి రావడాన్ని నేనెక్కువ ఆదరించలేదు. ఆశ్రమవాసినే అయివుండి, ఇతరులు ఎంతో ఉత్సాహ విశ్వాసాలతో చేస్తున్నప్పటికీ పరిక్రమించాలని తోచలేదు. కానీ, అంతమంది అలా చేయడం నన్ను ఆలోచింపచేసేది. దాంతో ఆసక్తిని కూడదీసుకొని, ఈ శారీరక శ్రమ ప్రయోజనకారియేనా? అని ప్రశ్నించాను. అపుడు జరిగిన సంభాషణలో ప్రదక్షిణను గురించి శ్రీవారి మాటల సారాంశమిది: ‘ఎవ్వరికైనా సరే, ప్రదక్షిణ మంచిది – విశ్వాసమున్నా, లేకున్నా! నమ్మకంతో పనిలేకనే ముట్టుకున్నవారిని అగ్ని కాల్చినట్లే, గిరి కూడా తనను ప్రదక్షిణించే వారిని కరుణిస్తుంది. అయినా ఈ ప్రశ్నలు, తర్కాలతో ఏం పని? ఒకవేళ ఆ మహిమాన్విత ప్రయోజనాలు సిద్ధించకపోతే పోనీ, కనీసం శరీర వ్యాయామమేనా అవుతుంది కదా’. నా మందబుద్ధికిలా తగిన సమాధానాన్నే ఇచ్చారు. ఇంకోసారి అన్నారిలా: ‘ఒక్కసారి చుట్టిచూడు, నీకే తెలుస్తుంది. నిన్నది ఆకట్టుకొంటున్నట్లు గ్రహిస్తావు’.
వృద్ధులుకానీ, సత్తువ లేనివారైనా సరే ప్రదక్షిణ చేస్తామంటే చాలు. వారిని
ఉత్సాహపరిచేవారే కానీ, ఊరుకోమని ఎన్నడూ అనలేదు. మహా అయితే ‘కొంచెం నెమ్మదిగా నడవండి’ అనేవారంతే. ఇన్నీ చూసాకా నేను కూడా గిరిప్రదక్షిణను నమ్మేవారిలో ఒకడినైనాను – నా ఆరోగ్యం, వయస్సుల దృష్ట్యా తరచు చేయలేకపోయినా!
ఇక గిరిప్రదక్షిణ విషయాన్ని సూరినాగమ్మగారి “శ్రీరమణాశ్రమ లేఖలు” పుస్తకంలో అత్యంత వివరంగా, విపులంగా ఇలా వివరించారు భగవానామెకు: “నందికేశ్వరుని అభ్యర్థనపై సదాశివుడు అరుణగిరి ప్రదక్షిణ మాహాత్మ్యాన్ని సవిస్తరంగా వర్ణించినట్లు అరుణాచల పురాణంలో వుంది. గిరిని చుట్టుట శుభం. ప్రదక్షిణ అనే మాటకు వ్యాఖ్యానమిది. ‘ప్ర’ అంటే సకల పాపాల నిర్మూలన; ‘ద’ అంటే సకలైశ్వర్య ప్రదానం. ‘క్షి’ అంటే పునర్జన్మల నాశనం; ‘ణ’ అంటే జ్ఞానమోక్ష ప్రసాదం.”
నిజంగా ప్రదక్షిణ చేస్తే కలిగే ఆహ్లాదాన్ని, ఆనందాన్ని వర్ణించతరమేనా? స్వామియే స్వయంగా ఆచరణపూర్వకంగా ప్రదక్షిణ చేసిచూపించి, ఇతరులను ప్రోత్సహించేవారు. మౌనమో, ధ్యానమో, జపమో, సంకీర్తనమో లేక ఏదైనా దేవతామూర్తిని స్మరిస్తూ, నవమాసాలు నిండిన గర్భిణీరాణి నడచినట్లు నడవాలి. కృత్తికాదీప ప్రదోష సమయంలో జ్యోతిదర్శనం చేసిన అంబ, గిరిప్రదక్షిణ చేసి శివుని వామభాగం పొంది అర్ధనారీశ్వరి అయింది.

In Letters from ప్రదక్షిణలో బాటకు ఎడంవైపు నడవాలి. కుడిపక్క నడిచే సిద్ధసుర సంఘాలకు మర్యాదచేస్తే వారి అనుగ్రహాశీస్సులు లభిస్తాయి. గిరిపై ఉన్న ఎన్నో ఓషధులపైనుంచి వీచే గాలివల్ల ప్రాణశక్తి, దేహపటిమ వృద్ధి చెందుతాయి. శరీరం, ఇంద్రియాలు అలసటతో నిస్సత్తువచెంది మనస్సు సహజంగానే అంతర్ముఖమై ధ్యానావస్థ లభించి, ఆసన పద్ధతి అలవడుతుంది.అంతేకాక, అతిముఖ్యంగా ప్రదక్షిణ అంటే సత్సంగమే. అరుణాచల స్మరణ, స్తోత్రం, దర్శనం, సన్నిధి నివాసం అన్నీ సత్సంగమే అయినా, వీటన్నిటి కంటే శక్తివంతమైనది ప్రదక్షిణ. గణేశుడు తండ్రిపెట్టిన పోటీలో గెలిచి ఫలాన్ని పొందినది ఇక్కడే, ఇలాగే. తొలిసారిగా చేసేవారు పెద్దలనడిగి, సంబంధిత పుస్తకాలు చదివి, ప్రదక్షిణ విధివిధానాలు, వివరాలు తెలిసికొని చేస్తే మంచిది.