భగవాన్‌ శ్రీ రమణమహర్షులవారు అరుణాచల వైభవాన్ని వర్ణించే వేలాది పురాణ శ్లోకాలను సేకరించారు. ఈ శ్లోకాల వాస్తవాలను వారెన్నో దర్శించారు కూడా. వీటిలో కొన్నిటిని తమిళంలోకి అనువదించగా అవి శ్రీరమణ గ్రంథమాలలో చేర్చబడ్డాయి. ఇక్కడ కొన్ని చూడవచ్చును.

శివ వచనం

స్వతః తేజోమయమైనప్పటికీ, కళావిహీనమైన సాధారణ కొండగా ఇక్కడ కనిపించుట ప్రాపంచిక క్షేమము కొరకైన నా దయావీక్షణమే. ఇక్కడ సిద్ధునిగా కూడా విరాజిల్లుతాను. నాలో(గిరి) అనేకానేక గుహలు భోగపూర్ణములై వైభవోపేతంగా ఉంటాయి. ఇది గ్రహించు. కర్మ ప్రతివారినీ ప్రపంచానికి బంధిస్తుంది. గిరిదర్శనంతోనే గిరిస్వరూపం ప్రసాదించే ఈ గిరియే సర్వులకు శరణ్యం. గిరిని సమీపంనుంచి గానీ, దూరంనుంచీ గానీ, దర్శించినా, లేదా తామున్న చోటనే వుండి దర్శించకనే మనసా స్మరించినా సరే గొప్పకష్టాలు పడితేనే గానీ రాని వేదాంత విజ్ఞానమును జనులు పొందగలరు. ఈ

గిరిచుట్టూ మూడు యోజనాలు (24 మైళ్ళు) దూరంలో నివసించేవారంతా ఎటువంటి దీక్షలు లేకపోయినా శివసాయుజ్యాన్ని పొందగలరని నేను ఆజ్ఞాపించుచున్నాను.

పై వాస్తవాలను గ్రహించాలంటే భగవాన్‌ చూపిన మార్గాన్ని అనుసరించాలి. ఈ అరుణాచల ప్రాభవాన్ని నిరూపించే సంఘటనలెన్నో మహర్షుల జీవిత కాలంలోనే సంభవించాయి. అంతేకాదు; వారి మార్గంలో నడిచినవారికీ ఈ అనుభూతులు కలిగాయి. భగవాన్‌వద్ద చిరకాలం జీవించిన దేవరాజ ముదలియార్‌ అంటారు:

”భగవాన్‌ స్వయంగా రెండు మహిమాన్విత సంఘటనలను వర్ణించారు. వారు కొండపై నివసించిన తొలినాళ్ళలో జరిగిన ఓ సంగతి. యువతి ఒకామె రాత్రివేళ ట్రైన్‌ దిగి గుర్రంబండిలో ఊళ్ళోకి వస్తోంది. బండివాడు దారిమళ్ళించి ఆమెను దోచుకోబోయాడు. హఠాత్తుగా ఇద్దరు పోలీసులు వచ్చి ఆమెను సురక్షితంగా ఇల్లు చేర్చారు. యువతి పోలీసుల నెంబర్లు గుర్తుపెట్టుకొని మరునాడు వారికోసం విచారించగా అట్టివారే లేరనీ, అటువంటి సంఘటనేదీ నమోదు అవలేదనీ తేలింది.

 

Arunachala with Green Foliage

మరో మహిమాన్విత సంఘటన: వృద్ధుడు, అవిటివాడు అయిన టి.కే. సుందరేశయ్యర్‌ బంధువొకడు గిరిప్రదక్షిణ చేస్తుండేవాడు. అయినవారి ఏవగింపు, ఈసడింపు సహింపలేక ఊరిని విడిచి పోవాలని పొలిమేర సమీపిస్తున్నాడు. అక్కడో బ్రాహ్మణ యువకుడు ఎదురై దురుసుగా “ఇవి కూడానా నీ మొహానికి” అంటూ అతని చేతికర్రలను లాగేసాడు. విస్తుపోయిన వృద్ధు తాను చేతికర్రల సాయంలేకనే నడువగల్గుతున్నానని గ్రహించి ఆనందపరవశుడయ్యాడు.

 

Arunachala Full Moon

ఈ సంఘటన తనకు ప్రత్యక్షంగా తెలుసుననీ అటువంటిదే అరుణాచల స్థల పురాణంలోనిది ఉదాహరించారు రమణలు. పంగున్ని కాళ్ళతో నడవలేక డేకుతూ ప్రదక్షిణించేవాడు. శోణతీర్థం చేరగానే శివుడు సాధువుగా దర్శనమిచ్చి, “అదేవిటీ లేచి శుభ్రంగా నడవలేవా?” అని గదమాయించి దాటిపోయాడు. పంగున్ని ఒకటే పరుగు!