ఆధ్యాత్మ కేంద్రము

భరత భూమిలోని ప్రతి క్షేత్రానికీ ప్రత్యేకమైన లక్షణము, సంప్రదాయ మార్గము ఉన్నాయి. వీనిలోకెల్ల అత్యంత సూటియైన, పటాటోపం లేని, క్రియాకలాపం అక్కరలేని, మౌనోపదేశం ద్వారా అందివచ్చే ఆత్మవిచార పంథాకి అరుణాచలం ప్రతీక. ఇదే సంగతి ప్రామాణిక శ్లోకాలలో ఉందిలా: “చిదంబర దర్శనం, తిరువారూర్‌లో జననం, కాశీలో మరణం మరియు అరుణాచల స్మరణం ముక్తిప్రదములు”. సూటిమార్గంలో భౌతిక సంపర్కం అవసరం లేదు; అందుచేత “స్మరణ మాత్రముననె” అన్నారు. భగవాన్‌ రమణులు కూడ ఇదే కారణంగా అరుణాచలాన్ని నివాసం చేసుకొన్నారు.

ArunaSpecial2_Deepam - Copy

అరుణాచలం ప్రపంచానికి ‘ఆధ్యాత్మిక కేంద్రం’ అని చెప్పారు. ‘అరుణ’ అంటే అగ్నివలె ఎర్రని, అయినా, వేడినిచ్చే సాధారణ అగ్ని కాదు. అరుణ అనగా జ్ఞానాగ్ని – వేడీ కాదు, చల్లనీ కాదు. అచలం అంటే కొండ. అలా అరుణాచలం అంటే జ్ఞానపర్వతం. గిరిపాదంలో వున్న తిరువణ్ణామలై (అరుణాచలం) – జిల్లా ముఖ్యపట్టణం. చెన్నైకి 120 మైళ్ళు, కాట్పాడి జంక్షన్‌కు 60 మైళ్ళ దూరంలో వుంది. పురాతన సంప్రదాయిక పండుగలు దేవాలయానికి జన సందోహాన్ని ఆకర్షిస్తాయి. వాటిలోకెల్ల ప్రఖ్యాతమైనది సాధారణంగా నవంబర్‌ నెలలో వచ్చే కార్తీక దీపోత్సవం. ఆనాడు కొండకొనపైన నేతిదీపాన్ని వెలిగిస్తారు. శ్రీరమణాశ్రమంలో ధనుర్మాసంలో వచ్చే రమణ జయంతి, వసంతకాలంలో వచ్చే ఆరాధన (సమాధి రోజు) ముఖ్యదినాలు.

గిరి ఆవిర్భావాన్ని గూర్చి పురాణమిలా వర్ణిస్తుంది. ఒకసారి బ్రహ్మవిష్ణువులు తమలో ఎవరు ఘనులని వివాదపడ్డారు. ఆ కారణంగా ప్రళయ కల్లోలం ఏర్పడగా దేవతలంతా శివుని ఆశ్రయించారు. శివుడపుడు వారిరువురి మధ్య జ్యోతిస్తంభంగా ఆవిర్భవించి, దాని ఆది అంతములను కనుగొన్నవారే గొప్పవారని ప్రకటించాడు. విష్ణువు వరాహరూపంలో భూమిని దొలుచుకుంటూ జ్యోతి మూలాన్ని, బ్రహ్మ హంసరూపంలో ఆకాశానికెగురుతూ జ్యోతి శిరస్సునూ కనుక్కోబోయారు. మూలాన్వేషణలో విఫలుడైన విష్ణువుకు క్రమంగా తనలోనే ప్రకాశిస్తున్న పరంజ్యోతి దర్శనమైంది. అదే సర్వులలో వెలిగే చైతన్యం. ధ్యానమగ్నుడైన విష్ణువు దేహస్పృహ కోల్పోయి, అన్వేషింపబోయిన తననే విస్మరించాడు. బ్రహ్మ ఆకాశమార్గంలో పతనమౌతున్న కేతకి (మొగలి) పుష్పాన్ని చూచి, కపటంతో గెలవాలని తలపోసి, వెనుతిరిగిపోయి తానా పుష్పాన్ని శివుని శిరస్సునుంచి గ్రహించానన్నాడు.
విష్ణువు తన ఓటమిని ఒప్పుకొని రుద్రునికి ప్రణమిల్లి స్తుతించాడు: ”నీవే ఆత్మజ్ఞానానివి, నీవు ఓం. నీవే ఆది మధ్య అంతానివి. నీవే అంతా. అంతటినీ వెలిగిస్తావు కూడా, తండ్రీ” అంటూ కరిగిపోయాడు. సంప్రీతుడైన అరుణాచల రుద్రుడు విష్ణువు ఘనుడని ప్రకటించి బ్రహ్మను కించపరిచాడు. ఈ ఘట్టంలో విష్ణువు బుద్ధికీ, బ్రహ్మ అహంకారానికీ, శివుడు ఆత్మకు ప్రతీకలు. కథ కొనసాగిందిలా: రుద్రతేజం సర్వులకు భరించరానిదిగా ఉండటంచేత బ్రహ్మవిష్ణువుల ప్రార్థనపై కొండగా రూపాంతరం చెందింది.

 

Arunachala, Mountain of Light

దేవి వాక్కు

ద్వి|| ఏనాడు నీ క్షేత్ర మీశభక్తులకు ధర్మబుద్ధులకు నాస్థానమైయుండు,

పరులకు బాధలు భావించు నరులు బహువిధవ్యాధులు పట్టి చెడుదురు;

ఇచట దుష్టులబల మెల్ల క్షణమున నణగు. ననలగిరి యరుణేశు కోప

కాలాగ్ని శలభమ్ము కావద్దు నీవు.

తా. ఎప్పుడును ధార్మికులకు, భక్తులకు వాసస్థలం ఈ క్షేత్రము. ఇతరులకు చెడు తలపెట్టు నీచులు పలురోగములు కలిగి చెడుదురు. ఇచ్చట దుష్టులబలము ఒక క్షణమున నశించును. అగ్ని శైలాకార అరుణాచలేశుని కోపదీప్తజ్వాలయందు మిడుతవు గావద్దు. (ఇది భగవాన్‌ రచన)