శ్రీరమణ మహర్షి

ట్రావెంకోర్‌ రిటైర్డ్‌ చీఫ్‌ జస్టిస్‌ కృష్ణస్వామి అయ్యర్‌ తన మహర్షుల దర్శనాన్ని వర్ణిస్తారిలా: ఏళ్ళ క్రితం మాట! అరుణాచల దివ్యజ్యోతి గిరిపై,పెద్దపెద్ద రాళ్ళ నడుమ సన్నటి గలగలల సెలయేరు. చెంతన బండలపైనా, చెట్ల కొమ్మలపైనా సంతోషంగా సంచరించే ఉడుతలు, కోతులు, పిట్టలు. హృదయాన్ని పట్టినిలిపే ఈ రమ్య దృశ్యపు నడుమ ఏ పటాటోపంలేని ఆశ్రమవాటిక. ఆ పావన సన్నివేశంలో ‘దీపం జ్యోతీ పరబ్రహ్మ’ అన్నట్లు దీపజ్వాలవలె ఉన్న యోగి నాజూకైన రూపం … అదీ భగవానుల ప్రథమ సందర్శనం. అటు పిమ్మట, ఆ దీపంయొక్క సెమ్మె నేటి శ్రీరమణాశ్రమంగా ఎదిగింది. జ్వాల అలాగే కొనసాగుతోంది – జాజ్జ్వల్యమానంగా. చిత్రమేమంటే, మామూలుగా చమురు జ్వాలకు పోషణ. కానీ, ఇక్కడ జ్వాలయే సెమ్మెకు, అందలి చమురుకూ ఆధారం.

మానవుల దుఃఖాన్ని శాశ్వతంగా నిర్మూలించి, తెంపులేని తేజోమయ పూర్ణానంద చైతన్యపు ఎరుకను అందించే డొంకతిరుగుడు లేని సూటిమార్గాన్ని మానవజాతికి ప్రసాదించారు శ్రీరమణమహర్షి. శ్రీవారి బోధల సారమంతా వారి రచన ‘నే నెవడను? లో ఇమిడి ఉంది. వ్యక్తి తన నిజతత్త్వాన్ని గుర్తించాడా, దేహ పరిమితులను దాటిపోయి తన స్వరూపం అమృతమని గ్రహిస్తాడు. దీనికోసం ‘ఆత్మ విచారణ’ చేయమంటారు శ్రీరమణులు. జాతి మత కుల ప్రసక్తి లేకుండా అంతా ఈ మార్గాన్ని అనుసరించవచ్చని సాధకులకు ధైర్యమిచ్చారు.

Bhagavan's Face at age 21