వేంకటరామన్‌ జీవితంలోని గొప్ప మలుపు సంభవించింది 1896 జులై మధ్యలో. ఓ మిట్టమధ్యాహ్నపు వేళ అకస్మాత్తుగా, ఊహించని విధంగా అతనిని దుర్భరమైన మరణభయం విచలితం చేసింది. తరువాత కాలంలో ఆయనే దానినీ విధంగా వర్ణించారు.

”నేను మధురైకి శాశ్వత వీడ్కోలు పలుకడానికి ఆరువారాల ముందు నా జీవితానికెల్లా గొప్ప మార్పు సంఘటించింది. అది జరిగింది చాలా అనూహ్యంగా, హఠాత్తుగా. మా పినతండ్రి గారింటి మేడపై గదిలో ఒక్కణ్ణీ కూచున్నాను.మామూలుగానే నాకు అనారోగ్యం అరుదు; ఇక ఆవేళ నేను ఏతేడా లేకుండా, నిక్షేపంలా ఉన్నాననే చెప్పాలి. అయితేనేం, ఓ ప్రచండమైన మరణభయం ఒక్కసారిగా నన్ను ముంచెత్తింది. ఇక, నాలోని ఏ అస్వస్థతను దానికి కారణంగా చెప్పను? దాన్ని వివరించాలని గానీ, కారణం అన్వేషించాలని గానీ నాకప్పుడు లేదు. తోచింది ఒక్కటే – ”నేను చనిపోతున్నాను”, ఇపుడేం చేయాలి. ఓ డాక్టరును సంప్రదించాలని గానీ, పెద్దలకో స్నేహితులకో చెప్పుకోవాలని గానీ తోచలేదు. ఆ సంకటాన్ని నా అంతట నేను, స్వయంగా, పరిష్కరించు కోవాలనుకున్నాను – అప్పుడే, అక్కడే!

మరణభయ తీవ్రతతో మనసులోనికి మునిగి అంతర్ముఖం కాగా నాలో నేనే ఇలా తర్కించుకున్నాను, ప్రత్యేకంగా మాటలతో పనిలేకుండానే:-

సరే చావు వచ్చిపడింది. అంటే? మరణించేదేమిటి? చనిపోయేది శరీరమే కదా’ అంటూ చావు స్థితిని అభినయించాను. వెల్లకిలా పడుకొని చేతులు చాచి కట్టెల్లా బిగించి, సన్నివేశం రసవత్తరమయేలా శవంలాగే తయారయ్యాను. ఊపిరి బిగపట్టాను. ఎటువంటి మాటా, కనీసం నేననే శబ్దం కూడా, పైకి రానట్లుగా పెదవులును బిగించాను. విచారణ కొనసాగించాను. ‘సరే, ఈ దేహం మరణించింది. దీన్ని శ్మశానానికి తీసుకెళ్ళి కాల్చి బూడిద చేస్తారు. మరి, శరీర మరణంతో ‘నేను’ అంతమైనట్లేనా? శరీరం నేనేనా? అది నిశ్శబ్ద, నిశ్చల జడపదార్థం. మరి ‘నేనో’… నా యొక్క ఎరుకను, స్ఫురణను దేహంతో పనిలేకుండా సంపూర్ణంగా కలిగియున్నాను. అంచేత నేను శరీరానికి అతీతమైన తత్త్వాన్ని. దేహం గతించినా, దానికి భిన్నమైన ఆత్మతత్త్వాన్ని చావు తాకనైనా తాకలేదు. అంటే నేను ‘చావని తత్త్వాన్ని’ అన్నమాట – ఇదంతా ఉత్తుత్తి ఆలోచన కాదు. ఈ సజీవ సత్యం నాలో స్ఫురించగానే ఆలోచనల ప్రసక్తి లేకుండా నేను దానిని సూటిగా గ్రహించాను. ‘నేను’ అనేదే నిజం. నా వర్తమాన ఉనికిని గూర్చిన ఏకైక సత్యం. ఈ ‘నేను’ కేంద్రంగానే శరీరానికి సంబంధించి ఎరుకతో కూడిన కార్యకలాపమంతా సంభవించేది. తత్‌క్షణం నుంచి నేను లేక ఆత్మ ఒక ప్రగాఢమైన ఆకర్షణతో తన దృష్టినంతనూ తన పైనే కేంద్రీకరించింది. చావు భయం సమూలంగా అంతరించిoది. మనసును లోపలే నిలిపి ఉంచే ఆత్మనిష్ఠ అప్పటినుంచి అప్రతిహతంగా, నిర్విరామంగా కొనసాగింది. సంగీతంలోని సప్తస్వరాల్లా ఇతర తలపులు వచ్చిపోవచ్చుగాక, కానీ ఆధార శ్రుతివలె ఈ ‘నేను’ యొక్క ఎరుక స్పష్టం, ప్రస్ఫుటం! శరీరం మాట్లాడటం, చదవడం వంటి ఏ పనుల్లో ఉన్నా ‘నేను’ పైనే ‘నా’ దృష్టి. ఈ సంఘటనకు ముందు ‘నేను’ను గూర్చి నా అవగాహన అంతంత మాత్రం. ఆకర్షణ సుంతైనా లేదు. ఇక దానిని తెలిసికొని నిష్ఠచెందే అవకాశమేదీ?”

ఈ మరణానుభవం వేంకట్రామన్‌ దృక్పథంలోను, నిత్యజీవితంలోను స్పష్టమైన మార్పు తెచ్చింది. అతడు సాధువులా, అణగిమణగి ఉండసాగాడు. పక్షపాత ధోరణిని ఎదిరించేవాడు కాదు. తరువాతి కాలంలో ఆయనే ఇలా వర్ణించారు:

“నాలో సంభవించిన మార్పులలో మీనాక్షీ ఆలయాన్ని గూర్చిన నా ధోరణి ఒకటి. పూర్వం స్నేహితులతో సరదాకో, మొక్కుబడికో వెళ్ళి, దేవీదేవతా మూర్తులను దర్శించి, విభూతి కుంకుమలను ధరించి ఇంటికొచ్చేవాణ్ణి. ఎటువంటి భక్తిభావం లేదు. మరిప్పుడో, ప్రతి సాయంత్రం వెళ్ళేవాణ్ణి – ఒక్కణ్ణీ. శివుడు, మీనాక్షి, నటరాజు లేదా 63 నాయనార్లు – ఏదో ఓ విగ్రహం ముందు నిశ్చలంగా నిలబడి చాలాసేపు ఉండిపోయేవాణ్ణి. భావావేశ తరంగాలు నన్ను ముంచెత్తేవి.