ఆగస్ట్‌ 29న వేంకట్రామన్‌ ఇంగ్లీష్‌ గ్రామర్‌ ఎస్సైన్‌మెంట్‌ చేసుకొంటున్నాడు. ఒక్కసారి ఈ చదువుల డొల్లతనం తోచి పుస్తకాలు పక్కకు తోసేసాడు. బాసింపెట్టి గాఢ ధ్యానావస్థుడైనాడు. ఇదంతా ఓకంట కనిపెడుతున్న అన్న నాగస్వామి విసుగ్గా “ఇటువంటి వానికివన్నీ ఎందుకో?” అని కసురుకున్నాడు. అన్న మాటల్లో సత్యాన్నే తీసుకున్న వేంకట్రామన్‌ ఈ తంతులన్నీ చాలించి, చెప్పాపెట్టకుండా ఇల్లువీడి పోదామనే నిశ్చయానికొచ్చాడు. స్కూల్‌లో స్పెషల్‌ క్లాసుందనే మిషతో లేచాడు. అలా అయితే తన స్కూల్‌ఫీజు కట్టమని అన్న 5రూ. తీసుకెళ్ళమన్నాడు. ప్రయాణానికి పైనుండి సహాయం మొదలైంది. టికెట్‌కు 3 రూ.లు లెక్కకట్టి, మిగిలిన 2 రూ.లు, దానితోపాటు ఈ కింది చీటీ, పెట్టెలో ఉంచి గడప దాటాడు. “నేను నా తండ్రి ఆదేశంపై ఆయనను వెతుక్కుంటూ బయలుదేరుతున్నాను. ఓ ఉదాత్తమైన ఆశయం కోసం ఈ నిష్క్రమణ. కాబట్టి ఈ విషయమై ఎవరూ బాధపడవద్దు. దీనిని వెతికించేందుకు డబ్బు ఖర్చుపెట్టవద్దు.

Arunachala Temple
Arunachala Temple

నీ కాలేజ్‌ ఫీజు కట్టబడలేదు. రెండురూపాయిలు ఇక్కడున్నాయి.

ఇట్లు,

….

వేంకటరామన్‌ ప్రయాణానికి పరదైవమే మార్గదర్శి. స్టేషన్‌కు ఆలస్యంగా చేరిన అతనికి ట్రైన్‌ కూడా ఆలస్యంగా రావడం కలిసొచ్చింది. తిరువణ్ణామలైకు సమీప స్టేషన్‌ దిండివనంగా అట్లాస్‌లో గుర్తించి అక్కడికి టికెట్‌ కొన్నాడు. రైల్లో ఓ ముస్లిం సాధువు మౌల్వీ గాఢధ్యానంలో మునిగివున్న ఈ బ్రాహ్మణ యువకుని చూసి, ముచ్చటపడి కబుర్లు మొదలెట్టాడు. ప్రయాణ వివరాలడిగి, విల్లుపురం నుంచి తిరువణ్ణామలైకు వేసిన కొత్త రైలుమార్గం గురించి చెప్పాడు.

తెల్లవారుజామున 3 గం.కు రైలు విల్లుపురం చేరింది. మిగిలిన దూరాన్ని నడుద్దామని తలపోసి, మార్గంకోసం ఊళ్ళో తిరుగుతుండగా అతనికి ఆకలి వేసింది. ఓ హోటల్‌ కెళ్ళగా, మధ్యాహ్నం వరకు వేచి ఉండమన్నారు. కూచున్న యువకుని గమనించాడు హొటల్‌ యజమాని. చక్కటి వర్చస్సు, నల్లని కురులు, బంగారు చెవిపోగులు, జ్ఞానశోభతో మెరిసే మోము; మూటా-ముల్లె లేదు. ముగ్ధుడైపోయి, అతనికి భోజనం పెట్టించి, అతడీయబోయిన రెండు అణాలను స్వీకరించలేదు. మళ్ళీ స్టేషన్‌ చేరిన వేంకట్రామన్‌ మిగిలిన డబ్బుతో మాంబలపట్టు వరకు టికెట్‌కొని రైల్లో మధ్యాహ్నానికి అక్కడికి చేరుకున్నాడు.

అక్కడినుండి సుమారు 20 కి.మీ నడిచి తిరుక్కోయిలూర్‌ చేరుకునేటప్పటికి సాయంత్రమైంది. దాపులోనే చిన్న గుట్టమీద ఉన్నది అరయనినల్లూరు గుడి. ఆవరణలోంచి దూరంగా లీలగా గోచరించే అరుణగిరి. వేంకట్రామన్‌ కోవెలలోపల ఓ మూలకూచుని ధ్యానమగ్నుడయాడు. కళ్ళు తెరవగానే మిరుమిట్లు గొలిపే పెద్ద కాంతిమేఘం, గుడిని ముంచేస్తూ. కాసేపటికది మాయమైంది.

తిరిగి ధ్యానమగ్నుడైన అతనిని అర్చకులు లేపారు, గుడి మూస్తామంటూ. వేంకట్రామన్‌ ప్రసాదం కోసం అర్థించగా వారు నిరాకరించారు. కొంచెం దూరంలో కీలూర్‌ అగ్రహారంలోని గుడికి వెళ్ళారందరూ. అక్కడకూడా అతనికి ప్రసాదం లభించకపోతే, ఆలయ వాద్యగాడు తన భాగాన్నిచ్చాడు. నీళ్ళకోసం దాపులోని ఇంటిని ఆశ్రయించబోయి దారిలోనే స్పృహతప్పి పడిపోయాడు. లేచి చూస్తే చుట్టూ గుంపు. తెప్పరిల్లి, చుట్టూ చెల్లాచెదరైన ప్రసాదం ఏరుకుని తిని, నీళ్ళుతాగి సేదతీరాడు.

మరునాడు 31 ఆగష్టు, శ్రీకృష్ణాష్టమి. కొంత నడచి, ముత్తుకృష్ణ భాగవతార్‌ ఇంటికి చేరాడు. ఇంటి ఇల్లాలు అతనికి అన్నం పెట్టి ఆదరించింది. వేంకట్రామన్‌ తన చెవిపోగులు యజమానివద్ద కుదువబెట్టి 4 రూపాయలు అప్పు తీసుకున్నాడు. గృహలక్ష్మి బాలకృష్ణునికోసం సిద్ధంచేసిన నైవేద్యాలను అభ్యాగత కృష్ణునికి సమర్పించి మరీ సాగనంపింది. స్టేషన్‌ చేరిన వేంకట్రామన్‌ అక్కడే నిద్రపోయాడు. మరునాడుదయమే ప్రయాణం. లేచి టికెట్‌కొని రైలెక్కాడు.

సెప్టెంబర్‌ 1, 1896. వేంకట్రామన్‌ ఇల్లు వదలిన మూడురోజుల తరువాత అరుణోదయవేళలో అరుణాచలంలో మంగళవారంనాడు మంగళప్రదంగా పాదం మోపాడు. అడుగు వడివడి … గుండె దడదడ. ఎక్కడా ఆగక, ఎటూ చూడక తిన్నగా శ్రీఅరుణాచలేశ్వర ఆలయాన్ని ప్రవేశించాడు. ప్రియభక్తునికి ప్రత్యేక స్వాగతచిహ్నంగా అన్ని ప్రాకార ద్వారాలు, గర్భాలయంతో సహా, బార్లా తెరచి ఉన్నాయి. భక్తుడు, భగవంతుడు మినహా వేరెవ్వరూ లేరక్కడ! అరుణాచలేశ్వర మహాలింగాన్ని ఆలింగనం చేసుకున్నాడు. ”నాయనా, నీ పిలుపుపై వచ్చాను. తీసుకో. నీ యిష్ట ప్రకారమే కానీ” అంటూ ఆత్మసమర్పణ చేసుకొన్నాడు. ప్రయాణం ముగిసింది. అసలు కథ ప్రారంభమైంది.