అది 1879 సం. డిసెంబర్‌ 29 వ తేదీ. స్థలం దక్షిణభారతం తమిళనాడులోని తిరుచ్చుళి క్షేత్రం. శివుని పంచమూర్తులలోని నటరాజ ఆనందమూర్తి ఆవిర్భావాన్ని పురస్కరించుకొని పెద్ద వేడుకతో జరిపే ‘ఆరుద్ర దర్శనం’ అనే వుత్సవ సమయం… గొప్ప సందడితో కోలాహలంగా ఉంది. అక్కడి శ్రీభూమినాథేశ్వర ఆలయంలోని ఉత్సవమూర్తులను అలంకరించి రథంపై వీధుల వెంబడి నడిపే ఊరేగింపు రోజంతా సాగి రాత్రికూడా కొనసాగుతుంది. అర్థరాత్రి దాటి డిసెంబర్‌ 30వ తేది ప్రవేశించింది. సరిగ్గా ఒంటిగంటకు కోవెలను ఆనుకుని ఉన్న ఇంట్లో ఒక మగశిశువు జన్మించాడు. సుందరం అయ్యర్‌, అళగమ్మ అనే పుణ్య దంపతులు ఆ బిడ్డకు తల్లిదండ్రులు. వేంకటేశ్వరన్ అని నామకరణం చేయబడిన ఆ శిశువే కాలక్రమంలో స్కూల్‌లో వేంకటరామన్ అయి భగవాన్‌ శ్రీరమణమహర్షి అని ఖ్యాతిగాంచాడు. ప్రసవ సమయంలో ఉన్న ఒక అంధురాలికి ఆ దివ్యశిశువు తేజోరాశి మధ్యలో ఉన్నట్లు కనబడింది!

Thiruchuli House -- Birth Place of Sri Ramana
Thiruchuli House — Birth Place of Sri Ramana

వేంకట్రామన్‌ బాల్యారంభం సాధారణం. తోటివారితో ఆటలు పాటలు… హాయిగా గడిచింది. ఆరేళ్ళ ప్రాయంలో ఓసారి అతడు తండ్రిగారి కోర్టు కాయితాలతో పడవలు చేసి ఆడుకోగా తండ్రి మందలించారు. అంతే, బాలుడు కనబడకుండా పోయాడు. ఎంతో వెతుకులాట అయ్యాక, పక్క గుళ్ళో జగన్మాత ప్రతిమ వెనుక కనబడ్డాడు పూజారికి. అలా తెలియని వయసులో కూడా ప్రాపంచిక సంకటాలనుంచి ఉపశమనానికై దైవసన్నిధినే ఆశ్రయించడం అతని భవిష్యత్‌ జీవితానికి సంకేతం.

వీధిబడి చదువు తిరుచ్చుళిలో పూర్తిచేసి తరువాత క్లాసులకు దిండిగల్‌ చేరాడు.1892 లో తండ్రి మరణం కుటుంబాన్ని కొంత అస్తవ్యస్తం చేసింది. వేంకట్రామన్‌, అన్నతో కలిసి, మధురైలో ఉంటున్న పినతండ్రి సుబ్బయ్యర్‌ ఇంటికి చేరుకున్నారు. మిగిలిన ఇద్దరు పిల్లలు తల్లితో ఉండిపోయారు. మధురలో వేంకట్రామన్‌ చదువు ముందు స్కాట్స్‌ మిడిల్‌ స్కూల్‌లోను, తరువాత అమెరికన్‌ మిషన్‌ హైస్కూల్లోను సాగింది.

స్కూల్‌ చదువులకంటే ఆటలంటేనే పిల్లవాడికి ప్రీతి. తనకున్న అద్భుత జ్ఞాపకశక్తితో విన్న పాఠాలు వెంటనే అప్పచెప్పేవాడు. అయితే, అతనికున్న వింత లక్షణం ఒకటే – మొద్దునిద్ర. ఎంత గాఢం అంటే, అతన్ని లేపడం ఓ బ్రహ్మ ప్రళయం! అతన్ని ఎదరించలేని తోటి కుర్రాళ్ళు, కక్షకట్టి రాత్రివేళ గాఢనిద్రలో ఉండగా, అతన్ని దూరంగా ఈడ్చుకెళ్ళి తనివితీరా బాదేవారట. అయినా, అతనికి రవంత కూడా ఎరుక ఉండదు. ఏం చోద్యం?!

ఓసారి బంధువొకరు రాగా వేంకట్రామన్‌, ”ఎక్కడనుంచి వస్తున్నారు?” అని వారిని అడిగాడు. ”అరుణాచలం” అన్నారాయన. గొప్ప ఆశ్చర్యంతో బాలుడు, ”అరుణాచలమా, అదెక్కడండీ?” అంటాడు. బాలుని అమాయకతకు జాలిపడి ఆయన ”అరుణాచలం అంటే తిరువణ్ణామలయే” అన్నారు. ఇదే సంఘటనను తరువాత కాలంలో స్వామి తన రచనలో పేర్కొన్నారు.

ద్వి|| 1. అరయరాని గిరిగ నమరియుం డహహ;

అతిశయ మీ సేత లరయు వా రెవరు?

అరయరాని చిరువయసు మొద లరుణ

గిరి చాల ఘనమని యెఱుకలో మెఱయ

నరయ లే దది తిరువణ్ణామల యని

దెలిసియు నొకరిచే దీని యర్థమును

ఎఱుకను మఱుగిడి యీడ్వ దాపునకు

నరిగిన సమయమం దచలమై గంటి. (అరుణాచల అష్టకం)

అనతికాలంలోనే, పెరియపురాణం (శివభక్తవిలాసం) అనే గ్రంథాన్ని మొదటిసారిగా చదివాడు యువకుడైన వేంకట్రామన్‌. పరమేశ్వరునికి ‘తను మన ధన ప్రాణ మానము’లను అర్పించుకున్న 63 నాయనార్ల అద్భుత గాథలవి. వారి భక్తి, విశ్వాసం, దివ్యావేశాలకు ముగ్ధుడై, అసలట్టి భక్తి తీవ్రత ఎలా సాధ్యం? అని ఆశ్చర్యపడేవాడు. త్యాగభరితమై, పరమేశ్వర సాయుజ్యానికి దారితీసే ఆ గాథలతనిని పరవశమొనర్చి, సాధుమార్గమును అనుసరించుటకై ఉరకలెత్తించేవి. నాటినుంచి అతనిలో ఓ దివ్యప్రేరణ వికసించసాగింది. దాని అనుభూతిని వారే, తన సహజ చమత్కార సరళ సరళిలో వివరించారు: ”ముందు అదో జ్వరం కాబోలు అనుకున్నాను. అయితే ఏం, హాయిగా ఉంది కదా, ఉండనిమ్మని ఊరుకున్నాను” అన్నారు.